శ్రీ అరవిందుల బోధన
యూట్యూబ్‌లో చూడండి (YouTube): https://youtu.be/cXtCazKPMT0
శ్రీ అరవిందుల సిద్ధాంతం భారతదేశపు ప్రాచీన ఋషుల బోధనల నుండి మొదలవుతుంది – అంటే, విశ్వంలోని ప్రత్యక్ష రూపాలన్నిటి వెనకాల సత్యమైన ఒక ఉనికి, ఒక చైతన్యము మరియు శాశ్వతమైన ఒకేఒక ఆత్మ వుంది. జీవులన్నీ ఆ ఒక్క ఆత్మలోనే ఏకమై ఉన్నప్పటికీ, చైతన్యం లోని ఒకానొక విభజన భావన వల్ల, నిజ ఆత్మ యొక్క మరియు మన్నస్సు-జీవిత-శరీరాల వాస్తవికతల జ్ఞానంలేకుండుటవల్ల, విభజించబడి వున్నాయి. ఈ వేర్పాటు చైతన్యపు తెరను ఒక నిర్దిష్టమైన మానసిక శిక్షణ ద్వారా తొలగించినప్పుడు , నిజమైన ఆత్మని, మనలోను మరియు అన్నిటా ఉన్న దైవత్వాన్ని తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
ఈ ఏకైక ఉనికి మరియు చైతన్యం ఇక్కడ జడ పదార్థంలో నిగూఢమై ఉంది అన్నది శ్రీ అరవిందుల ప్రబోధం. పరిణామం అనబడే పద్ధతిలో తనని తాను విముక్తి చేసుకుంటుంది. అచేతనంగా కనిపించే దానినుండే చైతన్యం వ్యక్తమవుతుంది. మరియు ఒకసారి వ్యక్తమైన తర్వాత, అది ఉన్నతోన్నత స్థాయిలకు అదే సమయంలో మరింత గొప్ప పరిపూర్ణత వైపు విస్తరించడానికి ప్రేరేపింపబడుతుంది. ఈ చైతన్య విముక్తిలో జీవితం మొదటి అడుగు; మనస్సు రెండవది; కానీ పరిణామం మనస్సుతో ముగియదు, అది అంతకంటే గొప్పదైన, ఆధ్యాత్మిక మరియు అతిమానసికమైన చైతన్యంలోకి విముక్తి కోసం ఎదురుచూస్తుంది. పరిణామంలో తదుపరి అడుగు చైతన్య జీవిలో అతిమానసాన్ని మరియు ఆత్మను ఆధిపత్య శక్తిగా వెళ్లడించడం వైపుగా ఉంటుంది. అప్పుడే వస్తువులలో నిగూఢంగా ఉన్న దైవత్వం పూర్తిగా విముక్తి పొందుతుంది, జీవితంలో పరిపూర్ణతను వ్యక్తపరచడం సాధ్యమవుతుంది.
అయితే, పరిణామ క్రమంలోని మునుపటి దశలు, మొక్కలు మరియు జంతువుల సంకల్పంతో పనిలేకుండానే ప్రకృతి జరిపించింది. కానీ మానవునిలో మాత్రము ప్రకృతి అతని సచేతన సంకల్పాన్ని సాధనంగా పరిణామం జరపగలుగుతుంది. అయితే, ఇది కేవలం మానవుని మానసిక సంకల్పంతో పూర్తిగా సాధ్యం కాదు, ఎందుకంటే మనస్సు ఒక నిర్దిష్ట స్థాయి వరకు మాత్రమే వెళ్ళగలదు మరియు ఆ తర్వాత ఒక వలయంలోనే తిరుగుతుంది. ఒక పరివర్తన జరగాలి, చైతన్యంలో ఒక మార్పు రావాలి, దాని ద్వారా మనస్సు మరింత ఉన్నత సూత్రాన్ని సంతరించుకోవాలి. ఈ పద్ధతి ప్రాచీన మానసిక క్రమశిక్షణ మరియు యోగా సాధన ద్వారా తెలుసుకొనబడుతుంది. గతంలో, ప్రపంచం నుండి వైదొలగి, ఆత్మ లేదా చైతన్యం యొక్క ఉన్నత స్థితిలో లీనమవడం ద్వారా దీనిని సాధించడానికి ప్రయత్నించారు. శ్రీ అరవిందులు బోధించేదేమంటే, ఉన్నత సూత్ర స్థాయి ఇక్కడికే అవతరించగలదని, అది ఆధ్యాత్మిక ఆత్మను కేవలం ప్రపంచం నుండి విముక్తి చేయడమే కాకుండా, ప్రపంచంలోనే విముక్తి చేస్తుందని, మనస్సు యొక్క అజ్ఞానాన్ని లేదా దాని అత్యంత పరిమిత జ్ఞానాన్ని ఒక అతిమానస సత్య-చైతన్యంతో భర్తీ చేస్తుందని, అది అంతరాత్మకు తగిన సాధనంగా ఉంటుందని, మరియు మానవుడు తనను తాను క్రియాత్మకంగానూ, అంతర్గతంగానూ కనుగొనడానికి వీలు కల్పిస్తుందని, ఇంకా తనలోని జంతు స్వభావం నుండి ఒక దైవిక జాతిగా ఎదగడానికి సహాయపడుతుందని. యోగా యొక్క మానసిక క్రమశిక్షణను ఈ ప్రయోజనం కోసం ఉపయోగించవచ్చు. జీవిలోని అన్ని భాగాలూ ఉన్నతమైన, ఇంకా రహస్యంగా ఉన్న అతిమానస సూత్రం యొక్క అవతరణకు మరియు కార్యాచరణకు తెరవడం ద్వారా పరివర్తన లేక రూపాంతరీకరణ సాధ్యమవుతుంది.
అయితే, ఇది ఒక్కసారిగా గానీ, తక్కువ సమయంలో గానీ, లేదా ఏదైనా వేగవంతమైన లేదా అద్భుతమైన పరివర్తన ద్వారా గానీ సాధ్యం కాదు. అతిమానస అవరోహణ సాధ్యం కావడానికి ముందు సాధకుడు అనేక చర్యలు తీసుకోవలసి వస్తుంది. మానవుడు ఎక్కువగా తన బాహ్య మనస్సు, ప్రాణం మరియు శరీరంపై ఆధారపడి జీవిస్తాడు, కానీ అతనిలో అంతర్గత సత్తా ఒకటి ఉంది, దానికి అతను మేల్కొనాలి—ఎందుకంటే ప్రస్తుతం దాని నుండి చాలా పరిమితమైన ప్రభావాన్ని మాత్రమే అతను పొందుతున్నాడు. ఆ సత్తానే అతన్ని గొప్ప సౌందర్యం, సామరస్యం, శక్తి మరియు జ్ఞానం కోసం నిరంతరం అన్వేషించేలా పురికొల్పుతోంది. కాబట్టి యోగా యొక్క మొదటి ప్రక్రియ ఈ అంతర్గత సత్తా యొక్క పొరలను తెరవడం మరియు లోలోతుల నుండి బయటకు జీవించడం, అంతర్గత జ్యోతి, శక్తుల ద్వారా తన బాహ్య జీవితాన్ని శాసించడం. అలా చేయడం ద్వారా అతను తనలో తన నిజమైన ఆత్మను కనుగొంటాడు. అది మానసిక, ప్రాణిక మరియు భౌతిక అంశాల యొక్క ఈ బాహ్య మిశ్రమం కాదు, వాటి వెనుక ఉన్న వాస్తవికతలో ఒక భాగం, ఏకైక దివ్య అగ్ని నుండి వచ్చిన ఒక నిప్పురవ్వ. అతను తన ఆత్మలో జీవించడం నేర్చుకోవాలి మరియు ఆ సత్యం వైపుగా ప్రేరణ ద్వారా తన స్వభావంలోని మిగిలిన భాగాలను శుద్ధి చేసి, సరైన మార్గంలోకి మళ్లించాలి. ఆ తర్వాత ఉన్నతమైన సత్తా సూత్రం యొక్క ఊర్ధ్వ వికాసం మరియు తనలోకి ఆ సత్తా యొక్క అవరోహణ జరగవచ్చు. కానీ అప్పుడు కూడా అది వెంటనే పూర్తి అతిమానస కాంతి మరియు శక్తి కాదు. ఎందుకంటే సాధారణ మానవ మనస్సుకు అతిమానస సత్య-చైతన్యానికి మధ్య అనేక చైతన్య స్థాయులు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్న స్థాయులను తెరచి వాటి శక్తిని మనస్సు, ప్రాణం మరియు శరీరంలోకి తీసుకురావాలి. ఆ తర్వాత మాత్రమే సత్య-చైతన్యం యొక్క పూర్తి శక్తి స్వభావంలో పనిచేయగలదు. అందువల్ల ఈ ఆత్మశిక్షణ లేదా సాధన ప్రక్రియ సుదీర్ఘమైనది మరియు కష్టమైనది, కానీ దానిలో కొద్ది భాగం సాధించినా అది చాలా పెద్ద లాభం, ఎందుకంటే అది అంతిమ విముక్తి మరియు పరిపూర్ణతను మరింత సాధ్యం చేస్తుంది.
పాత పద్ధతులకు చెందిన అనేక విషయాలు ఈ మార్గంలో అవసరం అవుతాయి — మనస్సును ఒక ఉత్తమమైన విశాలత్వానికి, ఆత్మ మరియు అనంతం యొక్క అనుభూతికి తెరచివుండుట, విశ్వ చైతన్యం అని పిలువబడే దానిలోకి ప్రవేశించుట, కోరికలు మరియు వాంఛలపై ఆధిపత్యం సాధించుట; బాహ్య సన్యాసం తప్పనిసరి కాదు, కానీ కోరిక మరియు అనుబంధంపై విజయం, శరీరంపై మరియు దాని అవసరాలు, అత్యాశలు, సహజ ప్రవృత్తులపై నియంత్రణ సాధించడం అనివార్యం. పాత పద్ధతుల సమ్మేళనం అవసరం: అంతర్లీనంగా వుండే వాస్తవికతకు మరియు పైపై రూపానికి మధ్య మనస్సు యొక్క విచక్షణ ద్వారా జ్ఞాన మార్గం, హృదయం ద్వారా భక్తి, ప్రేమ, శరణాగతుల మార్గం, మరియు సంకల్ప శక్తిని స్వార్థ ప్రయోజనాల నుండి వైదొలగించి సత్యం వైపుకు, అహాన్ని మించిన గొప్పదైన వాస్తవికత సేవ వైపుకు మళ్లించే కర్మ మార్గం. ఎందుకంటే, అత్యున్నతమైన జ్యోతి,శక్తులు ప్రకృతిలో పనిచేయడానికి అవకాశం కలిగినప్పుడు, జీవి తనలోని ప్రతీ అంశంలో, సంపూర్ణంగా స్పందించి రూపాంతరం చెందగలిగేలా శిక్షణ పొంది ఉండాలి.
ఈ సాధనలో, గురువు యొక్క ప్రేరణ, మరియు కష్టమైన దశలలో ఆయన యొక్క ఆదేశం, సాన్నిధ్యం అనివార్యం — ఎందుకంటే అవి లేకుండా ఈ మార్గంలో ముందుకు సాగితే, అనేక తడబాట్లు మరియు పొరపాట్లు జరిగి, విజయావకాశాలన్నీ కోల్పోబడతాయి. గురువు ఉన్నత చైతన్యం మరియు ఉన్నత స్థితికి చేరుకున్న వ్యక్తి, మరియు ఆయనను తరచుగా ఆ ఉన్నత స్థితి యొక్క అభివ్యక్తిగా లేదా ప్రతినిధిగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా, అంతకంటే ఎక్కువగా తన ప్రభావం మరియు ఆదర్శప్రాయమైన ఆచరణతో మాత్రమే కాకుండా, తన సొంత అనుభవాన్ని ఇతరులకు అందించగల శక్తి ద్వారా కూడా సహాయం చేస్తారు.
ఇది శ్రీ అరబిందుల బోధన మరియు సాధన పద్ధతి. ఏదైనా ఒక మతాన్ని అభివృద్ధి చేయడం లేదా పాత మతాలను కలపడం లేదా ఏదైనా కొత్త మతాన్ని కనుగొనడం ఆయన లక్ష్యం కాదు, ఎందుకంటే ఇవన్నీ అయన యొక్క కేంద్రిత ఉద్దేశ్యం నుండి దూరం చేస్తాయి. ఆయన యోగా యొక్క ఏకైక లక్ష్యం ప్రతి వ్యక్తి తన అంతర్గత స్వీయ-అభివృద్ధిని అనుసరించి, సమయానికి సర్వవ్యాప్తమైన ఆత్మను కనుగొని, మనస్సుని మించిన చైతన్యంలోకి, ఆధ్యాత్మిక, అతిమానస చైతన్యంలోకి పరిణామం చెంది, మానవ స్వభావాన్ని రూపాంతరీకరణ మరియు దైవీకరణ గావించటం.
శ్రీ అరవిందులు
ఒక శిష్యునికి లేఖ, ఫిబ్రవరి ౧౯౩౪
CWSA వాల్యూమ్ 36, ఆత్మకథాత్మక గమనికలు, పేజీలు: 547–550
అనువాదం: జ్యోతి, శ్రీ అరవింద ఆశ్రమం, పుదుచ్చేరి
యూట్యూబ్‌లో చూడండి (YouTube): https://youtu.be/cXtCazKPMT0